Tuesday, February 10, 2015

సందిగ్ధం...

చెప్పేస్తే ఓ పనైపోతుంది...
చెప్పకపోతే గుండె బరువెక్కుతూ పోతోంది...
తీరా చెప్పాక... శూన్యమైపోతే?
భారమా... శూన్యమా... ఈ సందిగ్ధంలో ఇలా ఎంత కాలం???

Saturday, October 13, 2012

చందూ గాడి కవితలు #1

మొన్నామధ్యన ఊరికెళ్ళినప్పుడు అటక మీద నుంచి ట్రంకు పెట్ట దించి పాత పుస్తకాలు, సామాన్లు తిరగేశాను. ఎప్పటినుంచో అనుకుంటున్న పని ఇన్నాళ్ళకి కుదిరింది. డిప్లోమా నాటి ఉత్తరాలు కూడా తిరగేసే భాగ్యం కలిగింది. అప్పట్లో సెల్ ఫోన్లు లేవు. మామూలు ఫోన్లు కూడా కరువే. ఫ్రెండ్స్ తో మాట్లాడాలి అంటే ఉత్తరమే గతి. ఇప్పుడు సెల్ ఫోన్లు, ఈ-మెయిళ్ళు పుణ్యమా అని మాట్లాడుకోవడం సులువయినా, మాటల్లో లోతు, సంగతులు పంచుకోవడంలో సున్నితత్వం తగ్గిపోయాయి. సరే... సరే... సోది ఆపి అసలు విషయం లోకి... అప్పట్లో మా చందూ బోలెడు కవితలు రాసే వాడు. కాలక్రమంలో వాటిని ఎక్కడో పడేసాడట. వాడు నాకు రాసిన ఉత్తరాల్లో ఉన్న ఆ కొన్ని కవితలూ, పదిలపరిచే ప్రయత్నంలో, ఇక్కడ రాస్తున్నా...

ప్రియా!

నిశీధి నాకు నిర్మలత్వాన్ని అనుభూతిస్తుంది
చిక్కటి చీకటి నాకు అనంతమయిన సత్యంలా గోచరిస్తుంది
అంతులేని ధవళ కాంతి కూడా అలాగే అనిపిస్తుంది
నిశి నా మనసులోని చీకటితో స్నేహం చేస్తుంది
కాంతి నా మనసులోని చైతన్యంతో సరసాలాడుతుంది
చీకటి నాకు నీ కురుల సౌందర్యాన్ని జ్ఞప్తికి తెస్తుంది
వెలుగు నాకు నీ దరహాస మాధుర్యాన్ని దీప్తిస్తుంది
చీకట్లో కనులు మూసుకుని నీ ఊహల్లో విహరిస్తుంటాను
వెలుతుర్లో నీ సుందర రూపాన్ని కాంచాలని కాంక్షిస్తాను

అమవాస నిశి నాకు బాల్య మిత్రుడు... మృదువుగా పలకరించి, బాల్య స్మ్రుతులెన్నో ఓపిగ్గా త్రవ్వి నాకు ఆనందమూ, విషాదమూ వెలగలపిన అనుభూతిని ప్రసాదిస్తాడు

పున్నమి నెలరేడు నా ప్రియుడు... చల్లగా వెన్నెలను కుమ్మరించి అనంత విశ్వ రహస్యాలను నా వీనులకు సోకిస్తాడు... కవ్వించే చంద్రుడు నన్ను నీ ఊహాలోకం లోకి నెట్టి మాదుర్యానుభూతులు కలుగజేస్తాడు.

నా హృదయ క్షేత్రమంతా పరచుకుని, దట్టంగా అలముకుని ప్రతి పొదనీ, ప్రతి వృక్షాన్నీ నిర్జీవితం కావిస్తున్న చీకటిని నీవు తీక్షణ కాంతి పుంజమై పారద్రోలావు, ఆనందమును విరజిమ్మావు.

వెలుగు నా ఆశ. చీకటి నా నేస్తం. రెంటినీ తట్టుకోలేను నేను. అనంతమయిన కాంతిని నేను భరించలేను. భయపడి చీకటిలోకి పారిపోతాను చిక్కటి చీకటి నాకు సహింపదు. వెలుగు కొరకు వెదుకుతుంటాను. ఎచ్చట శాశ్వతమున్నదో తెలిసికొనలేను

కొన్నాళ్ళు నీ రూపాన్ని చూస్తూ..
కొన్నాళ్ళు నీ ఊహల్లో ఉంటూ...
ఇలా జీవితాన్ని వెళ్లమారుస్తాను!!!

~చందూ
24/6/1998

Monday, October 17, 2011

చిన్న మాట ఒక చిన్న మాట...

చిన్న మాట... ఒక చిన్న మాట
చిన్న మాట... ఒక చిన్న మాట
చిన్న మాట... ఒక చిన్న మాట
సందె గాలి వీచీ... సన్న జాజి పూచీ...
జలదరించే చల్లని వేళా...
చిన్న మాట... ఒక చిన్న మాట
చిన్న మాట... ఒక చిన్న మాట

రాక రాక నీవు రాగా వలపు ఏరువాక...
నా వెంట నీవు నీ జంట నేను రావాలి మా ఇంటి దాకా...
నువ్వు వస్తే నవ్వులిస్తా... పువ్వులిస్తే పూజ చేస్తా...
వస్తే... మళ్ళీ వస్తే... మనసిస్తే చాలు... మాట,... మాట...
చిన్న మాట... ఒక చిన్న మాట
చిన్న మాట... ఒక చిన్న మాట

కన్ను కన్ను నిన్ను నన్ను కలిపి వెన్నెలాయె...
నీ వాలు చూపే నాలోన మెరుపై విరితేనెలే వెల్లువాయే...
అందమంతా ఆరబోసి... మల్లెపూల పానుపేసి...
వస్తే... తోడు వస్తే... నీడనిస్తే చాలు... మాట... మాట...
చిన్న మాట... ఒక చిన్న మాట
చిన్న మాట... ఒక చిన్న మాట
సందె గాలి వీచీ... సన్న జాజి పూచీ...
సందె గాలి వీచీ... సన్న జాజి పూచీ...
జలదరించే చల్లని వేళా...
చిన్న మాట... ఒక చిన్న మాట

సంగీతం: చక్రవర్తి
సాహిత్యం: వేటూరి
చిత్రం: మల్లె పువ్వు
గాత్రం: సుశీల

Friday, June 3, 2011

జీవితం...

అమాయకత్వంలో అందం
ఆపైన అంతా విషాదం

తర్వాత వైరాగ్యం

Wednesday, February 9, 2011

ఆ రోజు...

ఏప్రిల్ మాసపు పొద్దున్నే...
సముద్రం ఒడ్డున...
ఉదయిస్తున్న సూర్యుణ్ణి చూస్తూ నువ్వు...
నీ కళ్ళల్లో అర్ధాన్ని వెతుకుతూ నేను...
అంటీ అంటని నీ అర కౌగిలింత...
అర్ధం కాక తడబడ్డ నా మనసు...
రోజు... నీకు గుర్తుందా???

Monday, February 1, 2010

కల...

తానొక చిరుగాలి...
అనుభూతి పొందడమే తప్ప జ్ఞాపించలేను !

తాను అంటుంది "నీకు పిచ్చి" అని...
అంతరార్ధం నాకు తెలుసు...
ఒక చిరునవ్వు... తర్వాత నిశ్శబ్దం!!

తానొక నాట్యమాడే వర్షం...
తనలో తడవడమే గానీ చలి తెలీదు!!!

చప్పుడు కాకుండా వచ్చింది...
గుండెల్లో మోగిన గంటలు...
తర్వాత ఏం జరిగిందో జ్ఞాపకం లేదు!

తానొక గీతం...
మళ్ళీ మళ్ళీ చదువుతాను...
ఎప్పటికీ అర్ధం కాక తికమక పడతాను!!

తానొక మాయ...
నన్ను జీవంతో ఉంచుతుంది...
నాకు తెలుసు... నేను కల కంటున్నానని!!!

Monday, June 15, 2009

నీ పేరేంటి?

చుట్టూ చూసాను...
బోలెడు జనం...
గుంపులు గుంపులుగా జనం...
బోలెడంత హడావుడి...
కోలాహలం...
నవ్వులు, కేరింతలు...
ఏడుపులు, పెడబొబ్బలు...
ఎవరూ పరిచయస్తుల్లా కనిపించడం లేదు...
వాళ్ల లోకం వాళ్ళది...
నన్నెవరూ పట్టించుకోరేం?
అప్పుడు గుర్తొచ్చింది...
నువ్వు నాతోనే ఉన్నావని...

ఇంతకీ నీ పేరు ఒంటరితనమా?
లేక ఏకాంతమా?
భయమా? లేక మొండి ధైర్యమా?