Saturday, October 13, 2012

చందూ గాడి కవితలు #1

మొన్నామధ్యన ఊరికెళ్ళినప్పుడు అటక మీద నుంచి ట్రంకు పెట్ట దించి పాత పుస్తకాలు, సామాన్లు తిరగేశాను. ఎప్పటినుంచో అనుకుంటున్న పని ఇన్నాళ్ళకి కుదిరింది. డిప్లోమా నాటి ఉత్తరాలు కూడా తిరగేసే భాగ్యం కలిగింది. అప్పట్లో సెల్ ఫోన్లు లేవు. మామూలు ఫోన్లు కూడా కరువే. ఫ్రెండ్స్ తో మాట్లాడాలి అంటే ఉత్తరమే గతి. ఇప్పుడు సెల్ ఫోన్లు, ఈ-మెయిళ్ళు పుణ్యమా అని మాట్లాడుకోవడం సులువయినా, మాటల్లో లోతు, సంగతులు పంచుకోవడంలో సున్నితత్వం తగ్గిపోయాయి. సరే... సరే... సోది ఆపి అసలు విషయం లోకి... అప్పట్లో మా చందూ బోలెడు కవితలు రాసే వాడు. కాలక్రమంలో వాటిని ఎక్కడో పడేసాడట. వాడు నాకు రాసిన ఉత్తరాల్లో ఉన్న ఆ కొన్ని కవితలూ, పదిలపరిచే ప్రయత్నంలో, ఇక్కడ రాస్తున్నా...

ప్రియా!

నిశీధి నాకు నిర్మలత్వాన్ని అనుభూతిస్తుంది
చిక్కటి చీకటి నాకు అనంతమయిన సత్యంలా గోచరిస్తుంది
అంతులేని ధవళ కాంతి కూడా అలాగే అనిపిస్తుంది
నిశి నా మనసులోని చీకటితో స్నేహం చేస్తుంది
కాంతి నా మనసులోని చైతన్యంతో సరసాలాడుతుంది
చీకటి నాకు నీ కురుల సౌందర్యాన్ని జ్ఞప్తికి తెస్తుంది
వెలుగు నాకు నీ దరహాస మాధుర్యాన్ని దీప్తిస్తుంది
చీకట్లో కనులు మూసుకుని నీ ఊహల్లో విహరిస్తుంటాను
వెలుతుర్లో నీ సుందర రూపాన్ని కాంచాలని కాంక్షిస్తాను

అమవాస నిశి నాకు బాల్య మిత్రుడు... మృదువుగా పలకరించి, బాల్య స్మ్రుతులెన్నో ఓపిగ్గా త్రవ్వి నాకు ఆనందమూ, విషాదమూ వెలగలపిన అనుభూతిని ప్రసాదిస్తాడు

పున్నమి నెలరేడు నా ప్రియుడు... చల్లగా వెన్నెలను కుమ్మరించి అనంత విశ్వ రహస్యాలను నా వీనులకు సోకిస్తాడు... కవ్వించే చంద్రుడు నన్ను నీ ఊహాలోకం లోకి నెట్టి మాదుర్యానుభూతులు కలుగజేస్తాడు.

నా హృదయ క్షేత్రమంతా పరచుకుని, దట్టంగా అలముకుని ప్రతి పొదనీ, ప్రతి వృక్షాన్నీ నిర్జీవితం కావిస్తున్న చీకటిని నీవు తీక్షణ కాంతి పుంజమై పారద్రోలావు, ఆనందమును విరజిమ్మావు.

వెలుగు నా ఆశ. చీకటి నా నేస్తం. రెంటినీ తట్టుకోలేను నేను. అనంతమయిన కాంతిని నేను భరించలేను. భయపడి చీకటిలోకి పారిపోతాను చిక్కటి చీకటి నాకు సహింపదు. వెలుగు కొరకు వెదుకుతుంటాను. ఎచ్చట శాశ్వతమున్నదో తెలిసికొనలేను

కొన్నాళ్ళు నీ రూపాన్ని చూస్తూ..
కొన్నాళ్ళు నీ ఊహల్లో ఉంటూ...
ఇలా జీవితాన్ని వెళ్లమారుస్తాను!!!

~చందూ
24/6/1998

No comments: