ఎందుకో ఇవాళ రాయాలి అనిపిస్తుంది. ఊరెళ్ళి వచ్చి దాదాపు మూడు వారాలు కావస్తోంది. కళ్యాణి, పిల్లలు, ఇండియాలో ఉన్నారు. సాయంత్రాలు వంటికి ఖాళీ, మనసుకి (బుర్రకి అనాలేమో?) మోయలేనంత బిజీ ...
అప్పట్లో మనకి నచ్చిన బ్లాగులు అన్నీ ఒకచోట చదువుకోడానికి Google Reader ఉండేది. నచ్చిన రచయితల రాతలు అచ్చు అయ్యీ అవ్వగానే, వేడి వేడి బజ్జీలు పెనం లోంచి ప్లేట్లో వేసుకున్నట్టు, తిన్నగా Google Reader లో ప్రత్యక్షం అయ్యేవి. నచ్చినవీ, బాగా గుచ్చుకున్నవీ మనకు తోచిన వాళ్ళతో పంచుకొనే సౌలభ్యం కూడా ఉండేది. మనలా ఆలోచించే వాళ్ళతో పరిచయం చేసుకోడానికి కూడా వీలుగా బావుండేది. మరి అదేం రోగమో ... మరీ బాగా ఉన్న ప్రొడక్ట్స్ అన్నీ అర్ధాంతరంగా discontinue చేసేస్తూ ఉంటారు. ఒకానొక రోజున మూసేశారు. ఈ సోది అంతా ఎందుకు అంటారా? వస్తున్నా... అక్కడికే వస్తున్నా...
అలా subscribe చేసుకుని మరీ చదువుకునే వాటిలో బాగా గుచ్చుకున్న వాటిలో ఒకటి, ప్రణింద్ర అనే ఆయన రాసే 'నా గొడవ' అనే బ్లాగు. ఈయనకీ Google మాత లాగానే బాగా రాక్షసత్వం ఉంది అనుకుంటా ... మేనిఫెస్టో అనే ఆర్టికల్ లో, "ఈ బ్లాగుని కేవలం చదవబడడం కోసమే రాస్తున్నా" అని మొదలు పెట్టి , దాదాపు యాభై దాకా ఆర్టికల్స్ రాసి, ఒకానొక రోజున "ఎవరైనా ఎదురుచూసే వాళ్ళుంటే, ఒక నోటీసు" అనే శీర్షిక పెట్టి ఎంచక్కా బ్లాగు ముగించేసేశారు. ముగిస్తే ముగించారు, "చదవబడడం" సంగతి మరచి, పూర్తిగా ఆన్లైన్ నుంచి తప్పించేశారు. ఫణింద్ర గారి ఈ అరాచకం (ఇది నేను చాలా పాజిటివ్ టోన్ తో అంటున్నాను అని గమనించాలి) కొంచెం బాధ కల్గించినా, ముందుగా ప్రస్తావించిన మన Google Reader నా కోసం offline copies పొందుపరిచింది. ఆ విధంగా, తీరిక దొరికినప్పుడు, గుండెని బాగా పిండేసుకుందామని తీవ్రవాద ఆలోచనలు వచ్చినప్పుడు, చదువుకోడానికి ఆయన బ్లాగులో రాసిన articles అన్నీ, నా దగ్గర పదిలంగా ఉన్నాయి.
ఈ మూడు వారాల్లో ఏమీ తోచక చేసిన పనుల్లో ఒకటి... వాటి అన్నిటినీ సంక్రమించి ఒక pdf తయారు చేశాను. చదివిన ప్రతీ సారీ అదే తాజాదనం. కాపీరైట్స్ సంగతి నాకు తెలీదు... మీలో ఎవరైనా ఇది చదివి, "నా గొడవ" చదవాలని అనిపిస్తే... అది స్వయానా ఫణింద్ర గారే అయినా, నన్ను ఇమెయిల్ (rush2gopal@gmail.com) ద్వారా సంప్రదించగలరు.
No comments:
Post a Comment