Wednesday, August 13, 2025

అందం...

"కష్టపడే అమ్మాయిలు పొరపాటున కొంచెం అందంగా ఉన్నా, లోకానికి ఆ అందం వెనకున్న కల, కష్టం, కసి, కన్నీళ్లు కనిపించవు. అంతా ఆ అందం వల్లే వచ్చాయి అనుకుంటారు. అసలు అందం అంటే ఏమిటి? అది రూపమో, రంగో, అలంకారమో కాదు. ఏ ఒక్కరి జడ్జిమెంటో, అభిప్రాయమో కాదు. ఒక కవి వర్ణనో, చిత్రకారుడి బొమ్మో కాదు. మరి ఏంటది? అందమంటే గుణం. అమ్మాయినయ్యుండీ చెప్తున్నాను. I don't want people to call me beautiful. దాని బదులు నీది కష్టపడే తత్వం, నీలో కరుణ ఉంది, నీకు ధైర్యం ఎక్కువ, నువ్వు తెలివైన దానివి అంటే నాకు సంతోషం. Address us by our qualities. MS సుబ్బలక్ష్మి అంటే భక్తి; అందం కాదు. మదర్ థెరిసా అంటే కరుణ; అందం కాదు.  అయాన్ రాండ్ అంటే తత్వం; అందం కాదు. సరస్వతి అంటే విద్య, దుర్గ అంటే ధైర్యం, గౌరి అంటే తపస్సు, లక్ష్మి అంటే శుభం. ఇలా ఏ దేవతనైనా ఆమె గుణాల కోసమే పూజిస్తారు. అందం కోసం కాదు. నీ గుణాలే నీ సంతకమౌతాయి; నీ అందం కాదు. అందుకే ఆడదే ఆడదాన్ని అందాన్ని దాటి చూసుకోవాలి. అలా అందాన్ని దాటి చూస్తే, ఆడదానిలో ఒక సముద్రమే కనపడుతుంది. గుణాలతో నిండిన ఒక దేవతే దర్శనమిస్తుంది. So... seek the goddess in you."

ఇది సినిమా కోసం, ఆడవాళ్ళ కోసం ప్రత్యేకించి రాసిన డైలాగ్. నాకెందుకో ఇది ఇంకొంచెం generalize చేసి అన్వయిస్తే, అందరికీ సరిపోతుంది అనిపిస్తుంది. మనలో అందరూ, ఎవరో ఒకరి స్వీకరింపు (approval?) కోసమో, ధ్రువీకరణ (validation?) కోసమో, మెప్పు కోసమో ఆరాటపడుతూ ఉంటాము. ఎవరైనా పొగిడితే ఆనందమేస్తుంది; విమర్శిస్తే బాధేస్తుంది. దేనికీ ఖశ్చితమైన, నిర్దుష్టమైన ప్రమాణం ఉండదు. బయటవాళ్ళు ఎంత మెచ్చుకున్నా (నొప్పించినా), మనకంటూ మన గురించి ఒక ఖశ్చితమైన ఉద్దేశ్యం ఉండాలి అనిపిస్తుంది. మనల్ని మనం నిస్పాక్షికంగా (objective గా అన్న మాట) విశదీకరించుకుంటే, లోపలే ఉన్న మంచి, చెడు, అందం, కుళ్ళు, బలం, బలహీనత, భయం, బాధ అన్నీ స్పష్టంగానే కనపడతాయి. ఎంత వరకూ దాన్ని అంగీకరించి, దానికి అనుగుణంగా ముందుకెళ్లగలం అన్నది మన పరిపక్వత మీద ఆధారపడి ఉంటుంది.

సోది పక్కన పెడితే... సినిమా (8 వసంతాలు) చాలా బావుంది. ఇంకా చూడకపోతే, NETFLIX లో ఉంది; చూడండి!

PS: సినిమా డైరెక్టర్ పేరు ఫణీంద్ర నర్సేట్టి. coincidentally, 'నా గొడవ' రాసిన ఆయన పేరు కూడా 'ఫణీంద్ర'నే! సినిమాలో డైలాగ్స్, బ్లాగ్ లో రైటింగ్ స్టైల్ రెండూ బాగా దగ్గరగా ఉన్నాయి. ఒకరే అయ్యుంటారా?

No comments: