"నా మస్తిష్కంలో నేను కలిగిఉన్న అద్భుతప్రపంచం. చినిగి ముక్కలైపోకుండా ఎలా దానికి స్వేచ్ఛనందియ్యాలి, ఎలా నేను స్వేచ్ఛ పొందాలి? దాన్ని నాలోనే నిలుపుకోవడం లేదా సమాధి చేసేయడం కన్నా, శకలాలుగా చిధ్రమైపోయినా వెలికి తీసుకురావడమే వేయింతలు సబబైన మార్గమనిపిస్తుంది. నా జన్మహేతువిదే, ఇంతమేరకు నాకు స్పష్టంగా తెలుసు." - ఫ్రాంజ్ కాఫ్కా
కింద ప్రస్తావించిన ఫణీంద్ర గారి 'గొడవ'లు చదువుతున్నప్పుడు తారసపడింది. నిజమే కదా... ఏదో మంచి సినిమా చూసినప్పుడో, ఎక్కడో ఏకాంతంగా కూర్చున్నప్పుడో, ఓ మంచి పుస్తకం చదివినప్పుడో... మనసులో (మస్తిష్కం అనాలేమో!) ఏవో ఆలోచనలు మెదులుతాయి. అందులో కొన్ని ఇంకొకరితో పంచుకోవాలానో, రాయాలనో అనిపిస్తుంది. సమయం లేకపోవడం వల్లనో, వినే చెవులు లేకపోవడం వల్లనో అవి మరుగున పడిపోతూ ఉంటాయి. ముక్కలు ముక్కలుగా అయినా ఎక్కడైనా రాసిపెట్టుకుంటే, ఎప్పుడైనా తిరిగి చూసుకునే తీరికో, అవసరమో, అగత్యమో పడినప్పుడు, గతంలోకి వెళ్ళడానికి మనం అక్కడక్కడా వదిలిన గురుతులుగా మిగిలి ఉంటాయేమో!
No comments:
Post a Comment