Friday, July 18, 2025

మేరా కుచ్ సామాన్

నా సామాన్లు కొన్ని నీ దగ్గరే ఉండిపోయాయి

వర్షాకాలంలో నీతో కలిసి తడిసిన జ్ఞాపకాలు నీ దగ్గరే ఉన్నాయి

ఇంకా నా ఉత్తరాల్లో భద్రంగా చుట్టిన ఒక రాత్రి నీ దగ్గరే ఉండిపోయింది 

ఆ రాత్రి సెగల్ని ఆర్పేయి... నా సామాన్లు తిరిగి పంపెయ్యి


అది శరత్కాలం, అవునా? అప్పుడు రాలిన కొన్ని ఆకుల శబ్దం

వాటిలో ఒకటి నా చెవుల్లో కాసేపు ధరించి తిరిగి ఇచ్చాను

ఆ శరదృతువు రెమ్మ ఇప్పటికీ వణుకుతోంది

ఆ రెమ్మని పడెయ్యి... నా సామాన్లు తిరిగి పంపెయ్యి


మనం ఒకే గొడుగులో కలిసి చెరిసగం తడిసినప్పుడు

ఆరిపోయిన నా సగం మనసుని నాతో తెచ్చుకున్నాను

ఇంకా తడిసి ఉన్న మిగితా సగం నీ మంచం దగ్గరే పడి ఉంది

దాన్ని కూడా పంపించెయ్యి... నా సామాన్లు తిరిగి పంపెయ్యి


నీ భుజంపై నేను పెట్టిన పెట్టుడు మచ్చ 

కలిసి గడిపిన నూట పదహారు వెన్నెల రాత్రులు

తడి గోరింటాకు సువాసన

అర్ధం లేని కొన్ని పోట్లాటలు

ఉత్తుత్తినే నీకిచ్చిన మాటలు

అవన్నీ నీకు గుర్తు చెయ్యనా?

అవన్నీ పంపు... నా సామాన్లు తిరిగి పంపెయ్యి


అన్నీ పంపాక నేను వాటిని పాతిపెట్టిటానికి నాకో అనుమతి కూడా ఇవ్వు

నేనూ వాటితో పాటు అక్కడే నిదురిస్తాను... 

నేనూ వాటితో పాటు అక్కడే నిదురిస్తాను...


---

ఎప్పుడో ఇరవై ఏళ్ల క్రితం చూసిన "ఇజాజత్ " సినిమా లోని "మేరా కుచ్ సామాన్" అనే పాట, ఎప్పుడు విన్నా అదే అనుభూతి! గుల్జార్ గారికి ఎన్ని కృతజ్ఞతలు చెప్పినా తక్కువే!

No comments: