Wednesday, January 7, 2009

పిచ్చి రాతలు!

మొన్నీమధ్యన చెన్నై వెళ్ళినప్పుడు నా పాత స్నేహితుడిని ఒకతన్ని కలిసాను... పదహారేళ్ళ వయసులో, అప్పుడప్పుడే పల్లెటూరు నుంచి పట్నం వచ్చి, కొత్త అనుభవాలని, కొత్త అనుభూతుల్నీ కలిసి పంచుకున్న స్నేహమన్న మాట! మా కాలేజీ ఫోటోలు చూపిస్తుంటే ఎంత ఆనందమేసిందో! ఒకప్పుడు వాడు, ఎవరో అమ్మాయి వెనుక తిరుగుతూ బోలెడన్ని కవిత్వాలు రాసేవాడు! రేడియోలో "ఊసులాడే ఒక జాబిలట" అనే పాట వస్తోంటే ఏదో తత్తరపాటు!

గడిచిపోయిన రోజుల్లో రాసిన కవిత్వాలు, గడుస్తున్న రోజుల్లో తిరిగి చదవాడినికి కూడా టైం దొరకదు! ఎప్పుడో ఇల్లు సర్డుతున్నప్పుడు అవన్నీ కనిపిస్తే ఒక లాంటి అనుభూతి... ఏదో సాధించేద్దాం అని ఆనుకొని బయలుదేరి, పరిగెత్తి, దెబ్బలు తగిలి, కాళ్ళు నొప్పి పుట్టి, తడబడకుండా నడవడం నేర్చుకునే సరికి ఒక లాంటి అమాయకత్వం, భావుకత్వం అన్నీ దూరమయిపోతాయి... కొన్ని సార్లు అనిపిస్తూ ఉంటుంది... "ఏమీ తెలియని తనంలో ఎంత మేధస్సు, అద్భుతం ఉంటాయో అని". నిప్పుని ముట్టుకుంటే కాలుతుంది అని తెలియని పసి పిల్లాడికి ఉన్న అమాయకత్వపు ధైర్యం లాంటిది ఏదో, మనం అప్పుడప్పుడే వయసులో అడుగు పెట్టినప్పుడు మనకి పుష్కలంగా ఉంటుంది అనుకుంటాను! మొన్న ఎప్పుడో "కలం" గారి రాతల్లో ముళ్ళపూడి గారి డైలాగు ఒకటి బాగా గుచ్చుకుంది! "ఈదేసిన గోదారీ, దాటేసినా కష్టాలు తియ్యగా ఉంటాయట!"... ఎంత చక్కని జీవిత సత్యమో కదా!

ఇంతకీ ఇవన్నీ ఎందుకు రాస్తున్నాను నేను? ఏమో! రోజు వారీ జీవితంలో సవాలక్ష పిచ్చి రాతల్లో (ఆలోచనల్లో) ఇవి కొన్ని!

13 comments:

Unknown said...

good one Gopal. mana brainu rewritable DVD laga chakkani chinna tanapu anubhavalani tudichesi vaati paina manam nerchuikune kotta pataalu raastondi. manaki kuda expandable memory unte chala baagundu.

Uday said...

ప్రియమైన గోపాల్,

తెలుగు బ్లాగు ఆరంభించినందుకు ముందుగా నా అభినందనలు. కూడలి అనేది తెలుగు బ్లాగుల అగ్రిగేటర్. దానిలో రిజిస్టర్ చేయించగలవు. support@koodali.org అనే చిరునామాకి ఈ-మెయిలు పంపు.

ఇట్లు,
ఉదయ్.

రామచంద్రుని మనోధర్మం said...

గోపాళం,

మీ పిచ్చి రాతలు బావున్నాయి.. మీ లో కలిగిన ఈ భావాలు అందరికి కలుగుతాఇ... జీవితం లొ రేపు గురించి తెలియదు కాబట్టి, అమాయకత్వం కొంత ఎప్పుడూ ఉంటుందేమొ??

రామ చంద్రుడు
మనో ధర్మం

Gopala said...

రామ చంద్రుడి గార్కి,

నా బ్లాగ్ చదివినందుకు కృతజ్ఞతలు. చాలా సహజమైన సంఘటనలే మనల్ని బాగా కడులుస్తాయి అనుకుంటాను. అందరి జీవితంలో జరిగే విసేషాలే అయినా, ఎవరి సంఘటనలు వాళ్ళకి ప్రత్యేకం! అందుకే, జీవితం కొత్తగా, వింతగా సాగిపోతూనే ఉంటుంది!

అన్నట్టు మరిచాను, మీ బ్లాగ్ చదివాను! బాగా రాస్తున్నారు!

అభినందనలు!

చైతన్య said...

బాగుందండి మీ బ్లాగు...

"ఏమీ తెలియని తనంలో ఎంత మేధస్సు, అద్భుతం ఉంటాయో"

ఈ వాక్యం నాకు బాగా నచ్చింది!

~ చైతన్య
రాగం

Gopala said...

అంతే కదండీ మరి! అన్నీ తెలిసిన తర్వాత ఎలాగూ బుర్ర గోక్కోవాల్సిన పరిస్థితి! ఏమీ తెలియకపోవడం లోనే ఒక లాంటి మేధస్సు ఉందని నా అభిప్రాయం!

నేస్తం said...

"ఈదేసిన గోదారీ, దాటేసినా కష్టాలు తియ్యగా ఉంటాయట!".
బాగుందండి మీ బ్లాగు

రాధిక said...

వాకిట్లో పడుకుని పైకి చూస్తూ మబ్బులపైన ఏముంటుంది అనుకుని రక రకాల ఊహాగానాలు చేస్తూ గడిపేసావాళ్ళం మేము.విమానం ఎక్కి నిజం గా ఏముందో చూసి తెలుసుకున్నప్పుడు ఎంతటి విసుగు కలిగిందో?అమాయకత్వం ఇచ్చే ఆనందం,తృప్తి ఎందులోనూ రావేమో.మీరు చాలా బాగా రాస్తున్నారండి.

Gopala said...

రాధిక గార్కి,

నా బ్లాగు చదివినందుకు కృతజ్ఞతలు! ఈ మధ్యనే రాయడం మొదలెట్టినా, మిగితా వాళ్ళవి చాలా కాలంగా చదువుతున్నాను! ఒకప్పటి చందమామ, బాలమిత్ర లాంటి పుస్తకాల్లో చదివిన తర్వాత అంత క్రమంగా తెలుగు చదవడం ఈ బ్లాగుల్లోనే! త్వరలోనే మీ బ్లాగుకి ఇక్కడ లంకె కలుపుతాను!
-----------------------------------
నేస్తం గార్కి,

ఆ వాక్యం నాది కాదండి! ముళ్ళపూడి గారి వాక్యం, "కలం కలలు" గారు రాస్తే నేను చదివాను అన్నమాట! వాక్యం ఎవరిదైనా అర్ధం మాత్రం అందిరికీ వర్తిస్తుంది కదా!

మధురవాణి said...

గోపాళం గారూ..
ఇదే మొదటి సారండీ మీ బ్లాగు చూడడం. పిచ్చి రాతలు అని పేరు పెట్టి ఎంత చక్కగా రాశారండీ బాబూ :) నిజమే.. మీరు చెప్పినట్టు అమాయకత్వం లో ఉన్నంత ఆనందం మరెక్కడా లేదు.. మీ పోస్టు నాకు కూడా ఎన్నెన్నో గత స్మృతుల్ని గుర్తు చేసింది. బాగా రాసారు.
మీకు అభినందనలు.

అన్నట్టు.. మరి మీరు రాధాగోపాళమా.. వట్టి గోపాళమా :)

please remove 'word verification' option.

Gopala said...

మధుర వాణి గారు,

నా బ్లాగు చదివినందుకు సంతోషమండీ! మీరు కూడా బాగా రాస్తున్నారు!

వట్టి గోపాళంగా ఇన్నాళ్ళూ బతికి, ఈ మధ్యనే నా రాధని వెతుక్కున్నాను! కానీ ఆ రాధ పేరు కళ్యాణి! కాబట్టి, రాధాగోపాళం కాకపోయినా గోపీకళ్యాణం జరిగిందన్నమాట!

మురారి said...

"ఎప్పుడో ఇల్లు సర్డుతున్నప్పుడు అవన్నీ కనిపిస్తే ఒక లాంటి అనుభూతి... ఏదో సాధించేద్దాం అని ఆనుకొని బయలుదేరి, పరిగెత్తి, దెబ్బలు తగిలి, కాళ్ళు నొప్పి పుట్టి, తడబడకుండా నడవడం నేర్చుకునే సరికి ఒక లాంటి అమాయకత్వం, భావుకత్వం అన్నీ దూరమయిపోతాయి."


నిజమేనండీ..గోపాళం గారు. ఓ రోజు అనుకోకుండా పాత ఫోటోలు చూస్తే భలే అనిపిస్తుంది. అప్పటి ఫ్రెండ్స్, సరదాలు గుర్తుకు వస్తే మనసులో ఓ విధమైన ఉద్వేగం కలుగుతుంది. చాలా బాగా రాస్తున్నారు. కొనసాగించండి.

శిరి said...

ఇదే మొదటి సారి మీ blog చదవటం..."గోపాళం" అన్న పేరు చూడగానే నాకు ముళ్ళపూడి గారే గుర్తుకొచ్చారు... మీ బ్లాగ్స్ చదివాకా మీరు కూడా ఆయనకీ అభిమాని అని అనుకున్నా... తరువాత మీ Blogs చదువుతుంటే మన తెలుగు భాష ఎంత బాగుంటుందో, నేను US లో వుండి ఏమి మిస్ అవుతున్ననో తెలుస్తోంది... నాకు ఫలానా బాగుంది అని చెప్పలేను... మీ కవిత్వాలు, పిచ్చి రాతలు అన్నీ బాగా నచ్చాయి... మీ భావాలని అందమైన మాటలలో పెట్టినందుకు మీకు జోహార్లు... సారీ, మీరు ఎవరో తెలియకపోయెన, blog చదివి కామెంట్స్ ఇచ్చినందుకు ఏమి అనుకోవద్దు...