Wednesday, August 13, 2025

అందం...

"కష్టపడే అమ్మాయిలు పొరపాటున కొంచెం అందంగా ఉన్నా, లోకానికి ఆ అందం వెనకున్న కల, కష్టం, కసి, కన్నీళ్లు కనిపించవు. అంతా ఆ అందం వల్లే వచ్చాయి అనుకుంటారు. అసలు అందం అంటే ఏమిటి? అది రూపమో, రంగో, అలంకారమో కాదు. ఏ ఒక్కరి జడ్జిమెంటో, అభిప్రాయమో కాదు. ఒక కవి వర్ణనో, చిత్రకారుడి బొమ్మో కాదు. మరి ఏంటది? అందమంటే గుణం. అమ్మాయినయ్యుండీ చెప్తున్నాను. I don't want people to call me beautiful. దాని బదులు నీది కష్టపడే తత్వం, నీలో కరుణ ఉంది, నీకు ధైర్యం ఎక్కువ, నువ్వు తెలివైన దానివి అంటే నాకు సంతోషం. Address us by our qualities. MS సుబ్బలక్ష్మి అంటే భక్తి; అందం కాదు. మదర్ థెరిసా అంటే కరుణ; అందం కాదు.  అయాన్ రాండ్ అంటే తత్వం; అందం కాదు. సరస్వతి అంటే విద్య, దుర్గ అంటే ధైర్యం, గౌరి అంటే తపస్సు, లక్ష్మి అంటే శుభం. ఇలా ఏ దేవతనైనా ఆమె గుణాల కోసమే పూజిస్తారు. అందం కోసం కాదు. నీ గుణాలే నీ సంతకమౌతాయి; నీ అందం కాదు. అందుకే ఆడదే ఆడదాన్ని అందాన్ని దాటి చూసుకోవాలి. అలా అందాన్ని దాటి చూస్తే, ఆడదానిలో ఒక సముద్రమే కనపడుతుంది. గుణాలతో నిండిన ఒక దేవతే దర్శనమిస్తుంది. So... seek the goddess in you."

ఇది సినిమా కోసం, ఆడవాళ్ళ కోసం ప్రత్యేకించి రాసిన డైలాగ్. నాకెందుకో ఇది ఇంకొంచెం generalize చేసి అన్వయిస్తే, అందరికీ సరిపోతుంది అనిపిస్తుంది. మనలో అందరూ, ఎవరో ఒకరి స్వీకరింపు (approval?) కోసమో, ధ్రువీకరణ (validation?) కోసమో, మెప్పు కోసమో ఆరాటపడుతూ ఉంటాము. ఎవరైనా పొగిడితే ఆనందమేస్తుంది; విమర్శిస్తే బాధేస్తుంది. దేనికీ ఖశ్చితమైన, నిర్దుష్టమైన ప్రమాణం ఉండదు. బయటవాళ్ళు ఎంత మెచ్చుకున్నా (నొప్పించినా), మనకంటూ మన గురించి ఒక ఖశ్చితమైన ఉద్దేశ్యం ఉండాలి అనిపిస్తుంది. మనల్ని మనం నిస్పాక్షికంగా (objective గా అన్న మాట) విశదీకరించుకుంటే, లోపలే ఉన్న మంచి, చెడు, అందం, కుళ్ళు, బలం, బలహీనత, భయం, బాధ అన్నీ స్పష్టంగానే కనపడతాయి. ఎంత వరకూ దాన్ని అంగీకరించి, దానికి అనుగుణంగా ముందుకెళ్లగలం అన్నది మన పరిపక్వత మీద ఆధారపడి ఉంటుంది.

సోది పక్కన పెడితే... సినిమా (8 వసంతాలు) చాలా బావుంది. ఇంకా చూడకపోతే, NETFLIX లో ఉంది; చూడండి!

PS: సినిమా డైరెక్టర్ పేరు ఫణీంద్ర నర్సేట్టి. coincidentally, 'నా గొడవ' రాసిన ఆయన పేరు కూడా 'ఫణీంద్ర'నే! సినిమాలో డైలాగ్స్, బ్లాగ్ లో రైటింగ్ స్టైల్ రెండూ బాగా దగ్గరగా ఉన్నాయి. ఒకరే అయ్యుంటారా?

Thursday, July 31, 2025

జ్ఞాపకాల శకలాలు

"నా మస్తిష్కంలో నేను కలిగిఉన్న అద్భుతప్రపంచం. చినిగి ముక్కలైపోకుండా ఎలా దానికి స్వేచ్ఛనందియ్యాలి, ఎలా నేను స్వేచ్ఛ పొందాలి? దాన్ని నాలోనే నిలుపుకోవడం లేదా సమాధి చేసేయడం కన్నా, శకలాలుగా చిధ్రమైపోయినా వెలికి తీసుకురావడమే వేయింతలు సబబైన మార్గమనిపిస్తుంది. నా జన్మహేతువిదే, ఇంతమేరకు నాకు స్పష్టంగా తెలుసు." - ఫ్రాంజ్ కాఫ్కా

కింద ప్రస్తావించిన ఫణీంద్ర గారి 'గొడవ'లు చదువుతున్నప్పుడు తారసపడింది. నిజమే కదా... ఏదో మంచి సినిమా చూసినప్పుడో, ఎక్కడో ఏకాంతంగా కూర్చున్నప్పుడో, ఓ మంచి పుస్తకం చదివినప్పుడో... మనసులో (మస్తిష్కం అనాలేమో!) ఏవో ఆలోచనలు మెదులుతాయి. అందులో కొన్ని ఇంకొకరితో పంచుకోవాలానో, రాయాలనో అనిపిస్తుంది. సమయం లేకపోవడం వల్లనో, వినే చెవులు లేకపోవడం వల్లనో అవి మరుగున పడిపోతూ ఉంటాయి. ముక్కలు ముక్కలుగా అయినా ఎక్కడైనా రాసిపెట్టుకుంటే, ఎప్పుడైనా తిరిగి చూసుకునే తీరికో, అవసరమో, అగత్యమో పడినప్పుడు, గతంలోకి వెళ్ళడానికి మనం అక్కడక్కడా వదిలిన గురుతులుగా మిగిలి ఉంటాయేమో!

Friday, July 18, 2025

మేరా కుచ్ సామాన్

నా సామాన్లు కొన్ని నీ దగ్గరే ఉండిపోయాయి

వర్షాకాలంలో నీతో కలిసి తడిసిన జ్ఞాపకాలు నీ దగ్గరే ఉన్నాయి

ఇంకా నా ఉత్తరాల్లో భద్రంగా చుట్టిన ఒక రాత్రి నీ దగ్గరే ఉండిపోయింది 

ఆ రాత్రి సెగల్ని ఆర్పేయి... నా సామాన్లు తిరిగి పంపెయ్యి


అది శరత్కాలం, అవునా? అప్పుడు రాలిన కొన్ని ఆకుల శబ్దం

వాటిలో ఒకటి నా చెవుల్లో కాసేపు ధరించి తిరిగి ఇచ్చాను

ఆ శరదృతువు రెమ్మ ఇప్పటికీ వణుకుతోంది

ఆ రెమ్మని పడెయ్యి... నా సామాన్లు తిరిగి పంపెయ్యి


మనం ఒకే గొడుగులో కలిసి చెరిసగం తడిసినప్పుడు

ఆరిపోయిన నా సగం మనసుని నాతో తెచ్చుకున్నాను

ఇంకా తడిసి ఉన్న మిగితా సగం నీ మంచం దగ్గరే పడి ఉంది

దాన్ని కూడా పంపించెయ్యి... నా సామాన్లు తిరిగి పంపెయ్యి


నీ భుజంపై నేను పెట్టిన పెట్టుడు మచ్చ 

కలిసి గడిపిన నూట పదహారు వెన్నెల రాత్రులు

తడి గోరింటాకు సువాసన

అర్ధం లేని కొన్ని పోట్లాటలు

ఉత్తుత్తినే నీకిచ్చిన మాటలు

అవన్నీ నీకు గుర్తు చెయ్యనా?

అవన్నీ పంపు... నా సామాన్లు తిరిగి పంపెయ్యి


అన్నీ పంపాక నేను వాటిని పాతిపెట్టిటానికి నాకో అనుమతి కూడా ఇవ్వు

నేనూ వాటితో పాటు అక్కడే నిదురిస్తాను... 

నేనూ వాటితో పాటు అక్కడే నిదురిస్తాను...


---

ఎప్పుడో ఇరవై ఏళ్ల క్రితం చూసిన "ఇజాజత్ " సినిమా లోని "మేరా కుచ్ సామాన్" అనే పాట, ఎప్పుడు విన్నా అదే అనుభూతి! గుల్జార్ గారికి ఎన్ని కృతజ్ఞతలు చెప్పినా తక్కువే!

Thursday, July 17, 2025

నా గొడవ - ఫణింద్ర

ఎందుకో ఇవాళ రాయాలి అనిపిస్తుంది. ఊరెళ్ళి వచ్చి దాదాపు మూడు వారాలు కావస్తోంది. కళ్యాణి, పిల్లలు, ఇండియాలో ఉన్నారు. సాయంత్రాలు వంటికి ఖాళీ, మనసుకి (బుర్రకి అనాలేమో?) మోయలేనంత బిజీ ... 

అప్పట్లో మనకి నచ్చిన బ్లాగులు అన్నీ ఒకచోట చదువుకోడానికి Google Reader ఉండేది. నచ్చిన రచయితల రాతలు అచ్చు అయ్యీ అవ్వగానే, వేడి వేడి బజ్జీలు పెనం లోంచి ప్లేట్లో వేసుకున్నట్టు, తిన్నగా Google Reader లో ప్రత్యక్షం అయ్యేవి. నచ్చినవీ, బాగా గుచ్చుకున్నవీ మనకు తోచిన వాళ్ళతో పంచుకొనే సౌలభ్యం కూడా ఉండేది. మనలా ఆలోచించే వాళ్ళతో పరిచయం చేసుకోడానికి కూడా వీలుగా బావుండేది. మరి అదేం రోగమో ... మరీ బాగా ఉన్న ప్రొడక్ట్స్ అన్నీ అర్ధాంతరంగా discontinue చేసేస్తూ ఉంటారు. ఒకానొక రోజున మూసేశారు. ఈ సోది అంతా ఎందుకు అంటారా? వస్తున్నా... అక్కడికే వస్తున్నా... 

అలా subscribe చేసుకుని మరీ చదువుకునే వాటిలో బాగా గుచ్చుకున్న వాటిలో ఒకటి, ప్రణింద్ర అనే ఆయన రాసే 'నా గొడవ' అనే  బ్లాగు. ఈయనకీ Google మాత లాగానే బాగా రాక్షసత్వం ఉంది అనుకుంటా ... మేనిఫెస్టో అనే ఆర్టికల్ లో, "ఈ బ్లాగుని కేవలం చదవబడడం కోసమే రాస్తున్నా" అని మొదలు పెట్టి , దాదాపు యాభై దాకా ఆర్టికల్స్ రాసి, ఒకానొక రోజున "ఎవరైనా ఎదురుచూసే వాళ్ళుంటే, ఒక నోటీసు" అనే శీర్షిక పెట్టి ఎంచక్కా బ్లాగు ముగించేసేశారు. ముగిస్తే ముగించారు, "చదవబడడం" సంగతి మరచి, పూర్తిగా ఆన్లైన్ నుంచి తప్పించేశారు. ఫణింద్ర గారి ఈ అరాచకం (ఇది నేను చాలా పాజిటివ్ టోన్ తో అంటున్నాను అని గమనించాలి) కొంచెం బాధ కల్గించినా, ముందుగా ప్రస్తావించిన మన Google Reader నా కోసం offline copies పొందుపరిచింది. ఆ విధంగా, తీరిక దొరికినప్పుడు, గుండెని బాగా పిండేసుకుందామని తీవ్రవాద ఆలోచనలు వచ్చినప్పుడు, చదువుకోడానికి ఆయన బ్లాగులో రాసిన  articles అన్నీ, నా దగ్గర పదిలంగా ఉన్నాయి.

ఈ మూడు వారాల్లో ఏమీ తోచక చేసిన పనుల్లో ఒకటి... వాటి అన్నిటినీ సంక్రమించి ఒక pdf తయారు చేశాను. చదివిన ప్రతీ సారీ అదే తాజాదనం. కాపీరైట్స్ సంగతి నాకు తెలీదు... మీలో ఎవరైనా ఇది చదివి, "నా గొడవ" చదవాలని అనిపిస్తే... అది స్వయానా ఫణింద్ర గారే అయినా, నన్ను ఇమెయిల్ (rush2gopal@gmail.com) ద్వారా సంప్రదించగలరు.