Monday, June 15, 2009

నీ పేరేంటి?

చుట్టూ చూసాను...
బోలెడు జనం...
గుంపులు గుంపులుగా జనం...
బోలెడంత హడావుడి...
కోలాహలం...
నవ్వులు, కేరింతలు...
ఏడుపులు, పెడబొబ్బలు...
ఎవరూ పరిచయస్తుల్లా కనిపించడం లేదు...
వాళ్ల లోకం వాళ్ళది...
నన్నెవరూ పట్టించుకోరేం?
అప్పుడు గుర్తొచ్చింది...
నువ్వు నాతోనే ఉన్నావని...

ఇంతకీ నీ పేరు ఒంటరితనమా?
లేక ఏకాంతమా?
భయమా? లేక మొండి ధైర్యమా?

Friday, January 9, 2009

రాగాల పల్లకిలో కోయిలమ్మా...

రాగాల పల్లకిలో కోయిలమ్మా.. రాలేదు వేళ ఎందుకమ్మా!
రాలేదు వేళ కోయిలమ్మా... రాగాలే మూగబోయినందుకమ్మా!

పిలిచినా రాగమే... పలికినా రాగమే కూనలమ్మకీ...
మూగ తీగ పలికించే వీణలమ్మకీ...
పిలిచినా రాగమే... పలికినా రాగమే కూనలమ్మకీ...
మూగ తీగ పలికించే వీణలమ్మకీ...
బహుశా అది తెలుసో ఏమో... లల లాల్లల లలలలల లలలా...
గడుసు కోయిలా...
రాలేదు తోటకీ వేలా!

రాగాల పల్లకిలో కోయిలమ్మ... రాలేదు వేళ ఎందుకమ్మా!

గుండెలో బాధలే గొంతులో పాటలై పలికినప్పుడూ...
కంటి పాప జాలికి లాలీ పాడినప్పుడూ...
గుండెలో బాధలే గొంతులో పాటలై పలికినప్పుడూ...
కంటి పాప
జాలికి లాలీ పాడినప్పుడూ...
బహుశా తను ఎందుకనేమో... లల లాల్లల లలలలల లలలా... జాణ కోయిలా...
రాలేదు తోటకీ వేళా!

రాగాల పల్లకిలో కోయిలమ్మా... రానేల నీవుంటే కూనలమ్మా... కూనలమ్మా!

PS: ఎందుకో ఇవాళ పాట మరీ మరీ గుర్తుకొస్తోంది... ఎక్కడుందో కోయిలమ్మ!

Wednesday, January 7, 2009

పిచ్చి రాతలు!

మొన్నీమధ్యన చెన్నై వెళ్ళినప్పుడు నా పాత స్నేహితుడిని ఒకతన్ని కలిసాను... పదహారేళ్ళ వయసులో, అప్పుడప్పుడే పల్లెటూరు నుంచి పట్నం వచ్చి, కొత్త అనుభవాలని, కొత్త అనుభూతుల్నీ కలిసి పంచుకున్న స్నేహమన్న మాట! మా కాలేజీ ఫోటోలు చూపిస్తుంటే ఎంత ఆనందమేసిందో! ఒకప్పుడు వాడు, ఎవరో అమ్మాయి వెనుక తిరుగుతూ బోలెడన్ని కవిత్వాలు రాసేవాడు! రేడియోలో "ఊసులాడే ఒక జాబిలట" అనే పాట వస్తోంటే ఏదో తత్తరపాటు!

గడిచిపోయిన రోజుల్లో రాసిన కవిత్వాలు, గడుస్తున్న రోజుల్లో తిరిగి చదవాడినికి కూడా టైం దొరకదు! ఎప్పుడో ఇల్లు సర్డుతున్నప్పుడు అవన్నీ కనిపిస్తే ఒక లాంటి అనుభూతి... ఏదో సాధించేద్దాం అని ఆనుకొని బయలుదేరి, పరిగెత్తి, దెబ్బలు తగిలి, కాళ్ళు నొప్పి పుట్టి, తడబడకుండా నడవడం నేర్చుకునే సరికి ఒక లాంటి అమాయకత్వం, భావుకత్వం అన్నీ దూరమయిపోతాయి... కొన్ని సార్లు అనిపిస్తూ ఉంటుంది... "ఏమీ తెలియని తనంలో ఎంత మేధస్సు, అద్భుతం ఉంటాయో అని". నిప్పుని ముట్టుకుంటే కాలుతుంది అని తెలియని పసి పిల్లాడికి ఉన్న అమాయకత్వపు ధైర్యం లాంటిది ఏదో, మనం అప్పుడప్పుడే వయసులో అడుగు పెట్టినప్పుడు మనకి పుష్కలంగా ఉంటుంది అనుకుంటాను! మొన్న ఎప్పుడో "కలం" గారి రాతల్లో ముళ్ళపూడి గారి డైలాగు ఒకటి బాగా గుచ్చుకుంది! "ఈదేసిన గోదారీ, దాటేసినా కష్టాలు తియ్యగా ఉంటాయట!"... ఎంత చక్కని జీవిత సత్యమో కదా!

ఇంతకీ ఇవన్నీ ఎందుకు రాస్తున్నాను నేను? ఏమో! రోజు వారీ జీవితంలో సవాలక్ష పిచ్చి రాతల్లో (ఆలోచనల్లో) ఇవి కొన్ని!